GramSabha Boycott ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలులో రాజకీయ వివక్ష చూపుతున్నారంటూ మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామ పంచాయతీల పాలకవర్గాలు నిరసన గళం విప్పింది. అభివృద్ధిలో తమ గ్రామాన్ని విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ దాదాయిపల్లి సర్పంచ్ దేశ్‌పాండే నర్సింహారావు ఆధ్వర్యంలో గ్రామసభను బహిష్కరించారు.
నిధుల కేటాయింపులో అన్యాయం
మండలంలోని ఇతర గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ (NRGS) పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని, అలాగే స్వయం సహాయక సంఘాల భవనాలను కూడా కేటాయించారని సర్పంచ్ పేర్కొన్నారు. అయితే, దాదాయిపల్లి గ్రామానికి మాత్రం ప్రభుత్వం నుంచి పైసా నిధులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత నిధులతోనే అభివృద్ధి
దాదాయిపల్లి సర్పంచ్ నర్సింహారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పటికీ, తన సొంత ఖర్చులతో గ్రామంలో పార్కు, సీసీ రోడ్లు మరియు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశానని తెలిపారు.
“మేము అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లం కాదనే ఒకే ఒక్క కారణంతో నిధులు మంజూరు చేయడం లేదు. ఈ విధంగా వివక్ష చూపుతూ నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అని చెప్పుకోవడానికే తప్ప, క్షేత్రస్థాయిలో గ్రామాలకు చేసింది ఏమీ లేదు” అని ఆయన విమర్శించారు.
GramSabha Boycott అధికారుల తీరుపై ఆగ్రహం
గ్రామాభివృద్ధి కోసం తాము ఇచ్చిన వినతి పత్రాలను, లేఖలను కనీసం పై అధికారుల వద్దకు కూడా చేరనివ్వడం లేదని సర్పంచ్‌లు ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తమ గ్రామాలకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధి మరియు సమాన హక్కుల సాధన కోసమే ప్రజలు, పాలకవర్గ సభ్యుల సహకారంతో గ్రామసభలను బహిష్కరించే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. అందులో భాగంగానే గ్రామసభను బహిష్కరించి తమ నిరసనను తెలిపినట్లు చెప్పారు.