Fund Misuse : మెదక్ ( Medak )జిల్లా టేక్మాల్ ( Tekmal ) మండల పరిధిలోని తంపులూర్ (Tamplur) గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీవోకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.
Fund Misuse నిధుల మళ్లింపుపై ఆరోపణలు
గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 9,25,000/- (తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు) దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బంది మాధవాచారికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
లెక్కలు అడిగితే దాటవేత
నిధుల ఖర్చుపై గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా, ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. నిధులు ఎక్కడ ఖర్చు చేశారు? ఏ పనులకు వినియోగించారు? అనే విషయాలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన అధికారులపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
విచారణ కోరుతున్న గ్రామస్తులు
ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, గ్రామాభివృద్ధికి రావాల్సిన నిధులను తిరిగి పంచాయతీ ఖాతాలో జమ చేయించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. పారదర్శకత లేని అధికారుల వల్ల గ్రామం అభివృద్ధిలో వెనుకబడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
