Dadaipally Grama Sabha : అభివృద్ధిలో వివక్ష.. గ్రామసభ బహిష్కరణకు దాదాయిపల్లి నిర్ణయం : సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు

Dadaipally Grama Sabha : మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామాభివృద్ధి పట్ల అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనికి నిరసనగా నేడు జరగనున్న గ్రామసభను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు తెలిపారు. మండలంలోని ఇతర గ్రామాలకు స్వయం సహాయక సంఘం (SHG) భవనాలు, ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) కింద సీసీ రోడ్లు మంజూరైనప్పటికీ, తమ గ్రామానికి మాత్రం మొండిచేయి ఎదురైందన్నారు. అయినప్పటికి తన సొంత నిధులతో పార్కు, సీసీరోడ్డు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా, వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు.

Dadaipally Grama Sabha హక్కుల కోసం పోరాటం: సర్పంచ్ పిలుపు

గ్రామ హక్కుల సాధన కోసం సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సభ్యులందరూ ఏకమయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. “మా గ్రామానికి రావాల్సిన SHG భవనం, పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ నిధులు తక్షణమే మంజూరు చేయాలి. గ్రామ అభివృద్ధిలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ గ్రామసభను సామూహికంగా బహిష్కరిస్తున్నాం” అని ప్రకటించారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులందరూ ఏకమై ఈ బహిష్కరణకు మద్దతు తెలపాలని, హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన పిలుపునిచ్చారు.