TPTF Medak Protest : రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) మండిపడింది. విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట టీపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ యూనిస్‌కు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ వైఖరిపై ధ్వజం: ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొంగోటి యాదగిరి, పి. వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన పాలకులు, బడ్జెట్‌లో మాత్రం కేవలం 8.2 శాతం నిధులే కేటాయించి ప్రజలను నిరాశపరిచారని ఆరోపించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో 15 శాతం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దాన్ని విస్మరించడం ఉపాధ్యాయ లోకాన్ని విస్మయానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
TPTF Medak Protest

పథకాలు ప్రకటనలకే పరిమితమా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ వంటి భారీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, ఇంత తక్కువ బడ్జెట్‌తో వాటిని ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. నిధుల కొరత వల్ల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్, విద్యార్థుల కిట్లు వంటి పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
TPTF Medak Protest టిపిటిఎఫ్ ప్రధాన డిమాండ్లు
- విద్యా రంగానికి బడ్జెట్‌లో కనీసం 15 నుండి 20 శాతం నిధులు కేటాయించాలి.
- ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు, బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.
- కొత్త PRCని వెంటనే ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న DAలను విడుదల చేయాలి.
- ఖాళీగా ఉన్న రెగ్యులర్ DEO, MEO, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి.
- రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను ఏకకాలంలో చెల్లించాలి.
- అన్ని జిల్లాల్లో ఇఎల్టిసి (ELTC) కేంద్రాలను ప్రారంభించి ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించాలి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కొండల్ రెడ్డి, రామ్ కిషన్, మాజీ ఎంఈఓ నీలకంఠం, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్, యాదగిరి, మొయిజోద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు సాయిబాబా, రాజయ్య, దేవి సింగ్ మరియు మెదక్ జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.