Medak Collector | కోర్టు ధిక్కరణ కేసులో మెదక్​ కలెక్టర్​కు జైలు శిక్ష!

Medak Collector : కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష, 2వేల జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.

హైదరాబాద్: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Medak Collector Rahul Raj) కు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు రూ. 2,000 జరిమానా విధిస్తూ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది.

మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి గతంలో ఒక భూ వివాదానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. సదరు వివాదంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా యంత్రాంగం మరియు కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆమె తిరిగి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, కలెక్టర్ రాహుల్ రాజ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం రాజ్యాంగబద్ధమైన విధులను విస్మరించడమేనని పేర్కొంటూ, దీనిని ‘ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణ’గా పరిగణించింది. ఈ మేరకు ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తీర్పు వెలువరించిన అనంతరం అప్పీలు చేసుకునేందుకు వీలుగా హైకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది.