Jogipet : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన, సమయ పాలన పాటించకపోయిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీహెచ్ఎస్ (DCHS) డాక్టర్ షరీఫ్ పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు ఆసుపత్రిలోని వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడి వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్స్ కు బెడ్ పైన రెస్ట్ గా ఉండేందుకు వీల్ బెడ్స్, రోగులకు వెస్ట్రన్ బాత్రూం కావాలని ఆయనకు విన్నవించారు. అలాగే అంబులెన్స్ సౌకర్యం గురించి రోగులతో మాట్లాడగా 108 మాత్రమే ఉచితంగా సేవ చేస్తుందని, హాస్పిటల్ సంబంధించిన అంబులెన్స్ కు మాత్రం వెయ్యి రూపాయల డీజిల్‌లో పాటు బత్తా రూ. 200 చెల్లిస్తున్నట్లు తెలిపారు.
వెంటనే ఆ డ్రైవర్ని పిలిపించి డబ్బులు తీసుకుంటున్న విషయం అడుగగా తీసుకుంటున్నామని చెప్పాడు. మంత్రి వచ్చినప్పుడు లీవ్‌లో ఉన్న ఏడు మంది వైద్యులు, అలాగే చీటికిమాటికి డుమ్మాలు కొట్టే వైద్యులతో పాటు అంబులెన్స్ డ్రైవర్ పై కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రిలో మొత్తంగా 31 మంది డాక్టర్లు అవసరం ఉండగా పది మంది రెగ్యూలర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. కొందరిని జిల్లాలోని ఆసుపత్రుల నుండి సర్దుబాటు చేస్తూ 23 మంది జోగిపేట హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అయితే డాక్టర్లు సమయపాలన లేకుండా విధులకు హాజరవుతున్నారని. మరికొందరు విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నత అధికారులకు నివేదికను సమర్పిస్తున్నట్లు చెప్పారు.