మెదక్ జిల్లా (Medak dist) పాపన్నపేట (Papannapet) మండలం నాగ్సాన్ పల్లి వనంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల (Edupayala ) వనంలో కొలువుదీరిన ఏడుపాయల వనదుర్గామాత వనదుర్గా మాత కొలువుదీరింది. నిత్య పూజలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.
ఏడుపాయల ఆలయ విశిష్టత: తెలంగాణ (Telangana)లో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఏడుపాయ వనదుర్గా భవానీ మాత దేవాలయం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జల జల పారే వాగు వరదలతో అద్భుతమైన వాతావరణంలో నిత్యం భక్తులతో పూజలందుకుంటుంది వనదుర్గా మాత. భక్తులు కోరిన కోర్కెలు తీర్చె కల్పవల్లిగా ప్రసిద్ది చెందింది. కోరికలు నెరవేరిన భక్తుల మొక్కు చెల్లింపులు, నైవేధ్య హారతులతో నిత్యం కళ కళలాడుతుంది.
ఏడు పాయల సంగమం: ద్వాపర యుగంలో పరిక్షిత్తు అనే మహారాజు పాము కాటుతో మరణిస్తాడు. రాజు కొడుకు జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్ప జాతిని అంతం చేయడానికి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట గౌతమి, భరద్వాజ వంటి సప్త రుషులతో సర్ప యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్ని వచ్చి అగ్నికి ఆహుతి అవుతుంటాయి. తమ సంతతి అంతమవుతుందనే భయాందోళనతో దేవుళ్లకు ప్రార్థించగా గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించి యాగాలను చల్లార్పి వేస్తుంది. దీంతో యాగం ఆగిపోవడంతో సర్పజాతి కాపాడబడుతుంది. ఏడుపాయలుగా చీలి ప్రవహించడంతో ఇక్కడ అమ్మవారికి ఏడుపాయల దుర్గమ్మగా కొలుస్తారు.
ప్రకృతి మధ్యన దుర్గామాత: దట్టమైన అటవీ ప్రాంతం. ప్రజలు ఎవ్వరూ వెళ్లలేనంత దట్టమైన అడవి. (వనం) మధ్యలో, నది పాయల మధ్యన అమ్మవారు కొలువై ఉండటం ‘వనదుర్గా మాత’ అని పిలువడం ఆచరణలోకి వచ్చిందంటారు ఇక్కడి పూర్వీకులు. జనసంచారం పెరిగి, అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో దట్టమైన అడవి కనుమరుగైంది. నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూనే ఉంటారు. ప్రధానంగా శుక్రవారం, మంగళవారం భక్తులు ఎక్కువగా వస్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో జాతరను తలపించే విధంగా భక్తుల తాకిడి ఉంటుంది.
రెండవ అతిపెద్ద జాతర: సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత తెలంగాణలో అతిపెద్ద జాతరగా ఏడుపాయలలో జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏడుపాయల జాతరను అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తోంది. వర్షాకాలంలో నది పాయలు అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహించడం జరుగుతుంది.