Doddi Komurayya Jayanthi Husnabad : హుస్నాబాద్‌లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

Doddi Komurayya Jayanthi Husnabad : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు.

వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరుడు

ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షుడు సూర ఐలయ్య మాట్లాడుతూ.. నాటి నైజాం రజాకార్ల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి అసువులు బాసిన మహనీయుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. ప్రజలను కట్టుబానిసలుగా మార్చుతున్న రోజుల్లో సామాన్యుల్లో చైతన్యం నింపిన ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Doddi Komurayya Jayanthi Husnabad విగ్రహ ఏర్పాటుపై డిమాండ్

హుస్నాబాద్ పట్టణంలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపాలని ఐలయ్య కోరారు. అమరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు దొడ్డి ప్రేమ్ కుమార్, మేకల ఒదయ్య, కోట అశోక్, ఐలయ్య, సదయ్య, మల్లేష్, గడ్డం కొమురయ్య, గుంటి వెంకటస్వామి, రంజిత్, శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు.