Father driver son conductor : తండ్రి ‘స్టీరింగ్’ పడితే.. తనయుడు ‘టికెట్’ కొట్టాడు! హుస్నాబాద్ ఆర్టీసీలో అరుదైన దృశ్యం

father driver son conductor : రక్తం పంచుకు పుట్టిన కొడుకు తండ్రి అడుగుజాడల్లో నడవడం చూస్తాం.. కానీ తండ్రి నడిపే వాహనానికే కొడుకు తోడుగా నిలవడం అరుదుగా కనిపిస్తుంది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ డిపోలో ఆవిష్కృతమైన ఓ అద్భుత దృశ్యం ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. 34 ఏళ్లుగా ప్రమాదరహితంగా బస్సును నడిపిస్తున్న తండ్రికి, అదే బస్సులో కండక్టర్‌గా కొడుకు తోడవ్వడం ప్రయాణానికే సరికొత్త శోభను తెచ్చింది.

34 ఏళ్ల నిబద్ధత.. ఒక్కటైనా ప్రమాదం లేదు!

హుస్నాబాద్‌కు చెందిన బంధనాపురం ఎల్లయ్య టీజీఆర్టీసీలో (TGRTC) ఒక లెజెండ్. గత 34 ఏళ్లుగా ఆయన స్టీరింగ్ పడితే ప్రయాణికులకు అదొక భరోసా. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఒక్క చిన్న గీత కూడా బస్సుకు పడకుండా, ఎక్కడా ప్రమాదానికి తావు లేకుండా బస్సును నడిపిన రికార్డు ఆయన సొంతం. అందుకే ఆయన ఖాతాలో ఎన్నో ‘ప్రమాదరహిత డ్రైవర్’ అవార్డులు చేరాయి.

Father driver son conductor ఒకే బస్సు.. ఒకే లక్ష్యం!

తండ్రి బాటలోనే నడిచిన కుమారుడు ప్రేమ్ కూడా అదే ఆర్టీసీ సంస్థలో కండక్టర్‌గా కొలువు సాధించాడు. అయితే, శుక్రవారం వీరిద్దరి జీవితాల్లో ఒక మధుర ఘట్టం చోటుచేసుకుంది. హుస్నాబాద్ డిపో అధికారులు వీరిద్దరికీ ఒకే బస్సులో డ్యూటీ కేటాయించారు. తండ్రి ఎల్లయ్య డ్రైవర్ సీటులో స్టీరింగ్ పట్టి గమ్యం వైపు బస్సును నడిపిస్తుంటే, కొడుకు ప్రేమ్ వెనుక సీట్లలో ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తూ కనిపించారు.

Father driver son conductor ప్రయాణికుల ఫిదా.. తండ్రి గర్వం!

బస్సు ఎక్కిన ప్రయాణికులు తండ్రీకొడుకుల ఈ అరుదైన కలయికను చూసి ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు “తండ్రికి తగ్గ తనయుడు” అంటూ ప్రశంసలు కురిపించారు.

“నా బిడ్డ నా కళ్ల ముందే ఒకే సంస్థలో పని చేయడం ఒక ఎత్తైతే.. నేను నడిపే బస్సులోనే తను కండక్టర్‌గా ఉండటం నా జీవితంలో అత్యంత గర్వకారణమైన విషయం. ఆ ప్రయాణంలో నాకు తెలియని ఒక కొత్త ఉత్సాహం కలిగింది” అని ఎల్లయ్య గారు ఉద్వేగంతో తెలిపారు.