T20 World Cup ముంబై (వాంఖడే): టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా జరిగిన హై-వోల్టేజ్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో మట్టికరిపించి, వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాటర్ల విధ్వంసం, బౌలర్ల పట్టుదల వెరసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాయి.
శాంసన్ వీరవిహారం.. భారీ స్కోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సంజూ శాంసన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఊహించని ఊపునిచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఆడుకుంటూ వాంఖడే నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తోడుగా శివమ్ దూబే (43), ఇషాన్ కిషన్ (39) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బెతెల్ సెంచరీ వృధా.. వణికించిన ఇంగ్లండ్
T20 World Cup 254 పరుగుల రికార్డు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. భారత స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి భారత్‌ను ఆందోళనలోకి నెట్టాడు. విల్ జాక్స్ (35) తో కలిసి అతను చేసిన బాదుడుకు ఇంగ్లండ్ గెలుపు ఖాయమనిపించింది.
మ్యాచ్‌ను మలుపు తిప్పిన అక్షర్ క్యాచ్.. హార్దిక్ త్రో!
14వ ఓవర్లో అర్ష్‌దీప్ వేసిన బంతిని విల్ జాక్స్ భారీ షాట్ ఆడగా, డీప్ పాయింట్లో అక్షర్ పటేల్ పట్టిన అద్భుత క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో 30 పరుగులు అవసరమవ్వగా, మొదటి బంతికే సెంచరీ హీరో బెతెల్‌ను హార్దిక్ పాండ్యా మెరుపు త్రోతో రనౌట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ మూడు సిక్సర్లు కొట్టినా.. ఇంగ్లండ్ 246/7 వద్దే ఆగిపోయింది.