Tekmal : స్వయం పరిపాలనతో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయులు కె.బాల్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. 5వ తరగతి విద్యార్థులు వివిధ బాధ్యతలను చురుకుగా పోషించారు. కలెక్టర్‌గా ధరణి, డీఈవోగా శ్రీనాథ్, ఎంఈఓగా మధు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్‌గా దీక్షిత, పాఠశాల హెడ్‌మాస్టర్‌గా భాస్కర్ బాధ్యతలు నిర్వర్తించారు.

అలాగే ఉపాధ్యాయుల పాత్రలను విద్యార్థులే స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. బాల్య మాట్లాడుతూ విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా బాధ్యతలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో లక్ష్యాలను సాధించేందుకు పునాది పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజశేఖర్, నరేష్, మాలతి తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.