Velpugonda : మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామ రామాచలం కొండపై వెలిసిన శ్రీ రామచంద్రస్వామి వారి 42వ కళ్యాణ మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన చైత్ర శుద్ధ అష్టమి (గురువారం) నాడు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రెండో రోజు విశేష పూజలు

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం గోపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీరామ మూలమంత్ర హవనం, వాహన హోమం మరియు యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, స్త్రీమూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తుల రాకతో రామాచలం కొండ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
Velpugonda అన్నదాన కార్యక్రమం
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేడు కల్యాణ మహోత్సవం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నేడు (శుక్రవారం) అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలిరానున్నారు.