CMRF : చిన్నారి చికిత్సకు రూ. 5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

CMRF : ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఒక వరప్రదాయినిగా మారుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక చిన్నారికి మెరుగైన వైద్యం కోసం ఆయన ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ ఏనుమాముల సాయి గణేష్ కాలనీకి చెందిన కడమంచి దీక్షిత గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. విషయం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి రావడంతో, ఆయన తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్స కోసం నిధులు మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు రూ. 5,00,000/- విలువైన ఎల్‌ఓసీ కాపీని ఆయన స్వయంగా అందజేశారు.

CMRF నిమ్స్ లో మెరుగైన వైద్యం

ఈ ఎల్‌ఓసీ ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్షితకు మెరుగైన చికిత్స అందనుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా వైద్య అవసరాల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావొద్దని, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎల్‌ఓసీ ద్వారా ఉచితంగా, నాణ్యమైన చికిత్స పొందాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు దీక్షిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఉన్నారు.