LPG Gas Cylinder : గ్యాస్ సిలిండర్ల కోసం బారులు.. దేశవ్యాప్తంగా ‘పానిక్ బుకింగ్’! ప్రభుత్వం సంచలన నిర్ణయాలు

LPG Gas Cylinder : దేశంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై నీలినీడలు ముసురుకుంటున్నాయనే వార్తలతో సామాన్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా సిలిండర్లను బుక్ చేసుకుంటుండటంతో దేశవ్యాప్తంగా ‘పానిక్ బుకింగ్’ (Panic Booking) పెరిగిపోయింది. గత రెండు రోజుల్లోనే ఎల్‌పీజీ బుకింగ్స్ ఏకంగా 60 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

అసలు ఏం జరుగుతోంది?

పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) గుండా గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ స్టాక్‌కు అంతరాయం కలిగింది. భారత్ తన అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో 90 శాతం ఈ మార్గం నుండే రావాల్సి ఉంది.

LPG Gas Cylinder ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యలు

పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పలు కీలక ప్రకటనలు చేశారు:

  1. డొమెస్టిక్ కస్టమర్లకే ప్రాధాన్యత: గ్యాస్ కొరత ఉన్నప్పటికీ, వ్యాపార సంస్థల కంటే ముందుగా సామాన్య గృహ వినియోగదారులకే సిలిండర్లు సరఫరా చేయాలని నిర్ణయించారు.
  2. బుకింగ్ గడువు పెంపు: హోర్డింగ్‌ను అరికట్టేందుకు పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ గడువును 21 రోజుల నుండి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచారు.
  3. ఉత్పత్తి పెంపు: దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని 31 శాతం పెంచాలని రిఫైనరీలను ఆదేశించారు.
  4. బ్లాక్ మార్కెట్‌పై నిఘా: సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా దాడులు ముమ్మరం చేశారు. కేవలం ఒక్క రోజులోనే 1,300 తనిఖీలు నిర్వహించారు.

హోటల్ వ్యాపారులకు ఊరట

తొలిత వాణిజ్య సిలిండర్లను నిలిపివేసినప్పటికీ, తాజాగా 20 శాతం కోటాను హోటళ్లు మరియు రెస్టారెంట్ల కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా కిరోసిన్, బొగ్గు, మరియు పైప్డ్ గ్యాస్ (PNG) కనెక్షన్లను ఉపయోగించుకోవాలని సూచించింది.