Pulwama: పుల్వమా అమరవీరులను స్మరించుకుంటూ టేక్మాల్ లో కొవ్వొత్తుల ర్యాలీ

Pulwama: పుల్వమా అమరవీరులను స్మరించుకుంటూ మండల కేంద్రమైన టేక్మాల్ (Tekmal)లో నాయకులు, యువకులు, విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ ప్రపంచమంతా ప్రేమికుల రోజు జరుపుకుంటుంటే, మనం మాత్రం గుండె నిండా భారంతో ఉన్నామన్నారు. కళ్ళ నిండా అశ్రువులతో, మన దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన 40 మంది వీర జవాన్లను స్మరించుకుంటున్నామని తెలిపారు. 2019లో ఇదే రోజున పుల్వమాలో జరిగిన కిరాతక దాడిలో మన CRPF జవాన్లు వీరమరణం పొందిన విషయాన్ని గుర్తు చేశారు.

సరిహద్దుల్లో జవాన్ కాపలా ఉన్నంత కాలమే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని తెలిపారు. మనం పండగలు జరుపుకుంటున్నప్పుడు వారు మంచు కొండల్లో, ఎర్రటి ఎండల్లో పహారా కాస్తున్నారని చెప్పారు. తమ కుటుంబాలను, పిల్లలను వదిలి దేశమే దైవంగా భావించి పోరాడుతున్నారని తెలిపారు.

ఈ కొవ్వొత్తుల ర్యాలీ కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది మన గుండెల్లో రగులుతున్న దేశభక్తి జ్వాల. మన సైనికులకు మనం తోడుగా ఉన్నామని చెప్పే ఒక నమ్మకం అన్నారు. ఆ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, కుల మతాలకు అతీతంగా మనమంతా భారతీయులుగా దేశాభివృద్ధికి తోడ్పడదామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్దయ్య, గోవిందాచారి, చింత రవి, అశోక్, జయవర్ధన్ తదితరులు ఉన్నారు.