Telangana ZPTC MPTC Elections 2026: తెలంగాణలో రాజకీయ సందడి కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ZPTC, MPTC (పరిషత్) ఎన్నికలను మార్చి నెలలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టడంతో, అదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
ఈ భేటీలోని ప్రధానాంశాలు ఇవే:
- నోటిఫికేషన్ విడుదల: ఈ ఫిబ్రవరి నెలాఖరులోనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశంపై మంత్రులతో చర్చించనున్నారు.
- మార్చిలో పోలింగ్: మార్చి నెలలోనే పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వేసవి లోపే స్థానిక సంస్థల పాలనను గాడిలో పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
- మున్సిపల్ ఫలితాల విశ్లేషణ: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సానుకూలతను పరిషత్ ఎన్నికల్లో ఎలా ఓట్లుగా మార్చుకోవాలనే వ్యూహంపై చర్చించనున్నారు.
ఎన్నికల కోడ్ ముగియగానే యాక్షన్ ప్లాన్
ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కోడ్ ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించనుంది. ఒకవేళ అంతా అనుకున్నట్టు జరిగితే, మార్చి మొదటి లేదా రెండో వారంలోనే ఎన్నికల నగారా మోగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
రైతు భరోసా కూడా చర్చకు..
పరిషత్ ఎన్నికలకు వెళ్లే ముందే గ్రామీణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకే, ఈ నెల 17న రైతు భరోసా నిధులు విడుదల చేసే అంశాన్ని కూడా ఈ సమావేశంలో సీఎం ఖరారు చేయనున్నారు. అటు సంక్షేమం, ఇటు ఎన్నికల వ్యూహం.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.