Mptc, Zptc : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ!

  • నేడు క్లారిటీ ఇచ్చే అవకాశం: 15-20 రోజుల్లోనే ప్రక్రియ పూర్తికి కసరత్తు.
  • ఒకే విడతలో పోలింగ్? పరీక్షలు, బడ్జెట్ సెషన్స్‌పై సమీక్ష.
  • రూ. 500 కోట్ల నిధుల లక్ష్యంగా ప్రభుత్వం స్పీడ్!

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల భర్తీకి ప్రభుత్వం సమరశంఖం పూరించనుంది. ఎన్నికల నిర్వహణపై ముందడుగు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ భేటీ ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌పై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఒకే విడతలో ఎన్నికలు?

మున్సిపల్ ఎన్నికల ఊపును కొనసాగిస్తూనే, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. యంత్రాంగంపై భారం పడకుండా, కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల త్వరగా పాలనపై పూర్తిస్థాయి దృష్టి పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

పరీక్షలు, బడ్జెట్ షెడ్యూల్‌పై కసరత్తు

రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు, మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు మార్చి రెండో వారం నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా సర్దాలి? పరీక్షలకు ముందే ప్రక్రియ ముగించాలా లేక ఏప్రిల్‌లో నిర్వహించాలా? అనే అంశాలపై విద్యాశాఖ మరియు ఎన్నికల సంఘం అధికారులతో సీఎం సమాలోచనలు జరపనున్నారు.

రూ. 500 కోట్ల నిధులే టార్గెట్!

ప్రస్తుతం రాష్ట్రంలో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలు అధికారుల పాలనలో ఉన్నాయి. వీటిని మార్చి నెలాఖరులోపు భర్తీ చేయడం ద్వారా, కేంద్రం నుండి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను (రూ. 500 కోట్లకు పైగా) రాబట్టాలని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేస్తోంది. పాలకవర్గాలు ఉంటేనే ఈ నిధుల విడుదల సులభతరం అవుతుండటంతో, వీలైనంత త్వరగా ఎన్నికలు ముగించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.