జగిత్యాల రాజకీయ గడ్డపై జీవన్ రెడ్డి తిరుగులేని నాయకుడని ఆయన అనుచరులు మరోసారి చాటి చెప్పారు. తాజా ఫలితాల్లో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. పార్టీ అండ ఉన్నా లేకున్నా, నాయకుడిపై నమ్మకంతో బరిలోకి దిగి భారీ విజయాలను నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం నిజాయితీగా పనిచేసే జీవన్ రెడ్డిని కాదని బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన సంజయ్ కుమార్ వర్గానికే కాంగ్రెస్ పార్టీ అండదండలు, బీ ఫామ్ ఇచ్చింది. తనను నేరుగా ఎదుర్కోలేక రాజకీయంగా కట్టడి చేయడానికే ఇదంతా చేస్తున్నారని జీవన్ రెడ్డి గమనించారు. అనుచర వర్గాన్ని దూరం చేసుకోకుండా రాజకీయంగా తన ప్రాభల్యం ఏమిటో చూపించడానికి తన వర్గానికి చెందినవారిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంచారు.
ఎన్నికల ప్రచారం, ఓటింగ్, కౌంటింగ్ అన్ని జరిగిపోయాయి. వచ్చిన ఫలితాలను చూసిన అందరికి షాక్. జీవన్ రెడ్డి వర్గానికి చెందిన 12 మంది స్వతంత్ర అభ్యర్థులు ఘన విజయం సాధించి తమ సత్తా చాటారు. బి-ఫామ్ పొందిన 15 మందిలో 9 మంది విజయం సాధించడం విశేషం. మరో 6గురు అభ్యర్థులు కేవలం 20 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలవ్వడం గమనార్హం. ఇది వారికి క్షేత్రస్థాయి ఉన్న ప్రజా బలానికి నిదర్శనం. అంటే పార్టీని నమ్ముకున్న వ్యక్తిని కాదని, పరాయి పార్టీ వారిని పక్కన పెట్టుకుని ఏదో చేద్దామనుకున్నా అధికార పార్టీ అయినా… తమ నాయకుడే తమకు ముఖ్యం అని విశ్వాసాంతో ఉన్న బలమైన కార్యకర్త పనితనానికి ప్రత్యక్ష సాక్ష్యంగా జగిత్యాల ఎన్నికలు నిలుస్తాయి. ప్రజల్లో నాయకుడిగా ఎదిగిన వ్యక్తికి పార్టీ అనేది ప్రత్యమ్నాయమే. అది అధికార పార్టీ అయినా, ప్రతి పక్ష పార్టీ అయిన తనకు పార్టీ అవసరం లేదు. పార్టీకే అతని అవసరం ఉంటుంది అనేది నగ్న సత్యం. కానీ నేటి విలువలు లేని రాజకీయాల్లో అడ్డదారిలో అందలం ఎక్కేవారికే జై కొట్టడం సహజమే కదా?