ఏడుపాయల జాతర ఏర్పాట్లను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఏడుపాయల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లాస్థాయి అధికారులతో కలిసి ఏడుపాయలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. జాతరకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం వరకు మొత్తం పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా తాగునీరు, ట్రాఫిక్, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు స్థలాలకు సంబంధించిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా సమన్వయంతో పని చేస్తే పనులు త్వరగా పూర్తయి అవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఘనపూర్ ఆనకట్ట తో పాటు దేవాలయం దగ్గర బారీకేడ్ల ఏర్పాటు, స్నానాల కోసం ఏర్పాటుచేసిన షవర్లను, ఇరువైపులా పార్కింగ్ స్థలాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట ఆలయ ఈవో వీరేశంతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు