శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరుముడులతో శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు
మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో బోడ్మట్ పల్లి నుంచి శివస్వాములు శ్రీశైలం బయలుదేరారు. శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో మండల కాలంగా శివ స్వాములు భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో శివదీక్ష చేపట్టారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి ముడుపులను ముట్టజెప్పి దీక్ష విరమించనున్నారు. ఇందుకోసం బుధవారం సుమారు 20 మంది శివ స్వాములు ఇరుముడులు కట్టుకొని శ్రీశైలం బయలుదేరారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం ఇరుముడి కట్టే కార్యక్రమం నిర్వహించారు. హర హర మహాదేవ ఓం నమః శివాయ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఈ సందర్భంగా గురు స్వామి మాట్లాడుతూ, శివ భక్తులు నియమ నిష్టలతో దీక్ష చేపట్టి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. సంవత్సరాలుగా శివ స్వాములు మాలలు ధరించి శివదీక్ష పూని ఇక్కడినుండి యాత్రగా వెళ్లి శివరాత్రి పర్వదినాన శ్రీశైల మల్లన్నకు ఇరుముడులు సమర్పించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా శివ స్వాములు సమూహంగా శ్రీశైలం యాత్రకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. యాత్రకు బయలుదేరిన శివ స్వాములకు కుటుంబ సభ్యులు, భక్తులు పూలమాలలు వేసి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శివ గురుస్వాములు భక్తులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.