Alladurg: అల్లాదుర్గం మండలంలో చిరుత పులి (Leopard) సంచరిస్తుందన్న విషయం వాస్తవమేనని శంకరంపేట్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీ శాఖ అధికారులు చిరుత సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించి, ఆనవాళ్ళను గుర్తించారు. అనంతరం సమీప తండా ప్రజలకు పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గొల్ల కుంట తండా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లినట్లు గుర్తించారు.
పశువులను మేపడానికి వెళ్లేవారు, గొర్ల కాపరులు , వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులు, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మండలంలో చిరుత పులి సంచరిస్తునందున ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. మరోసారి చిరుత కనిపిస్తే సమాచారం అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ మనస్విని, సర్పంచ్ మాన్యా నాయక్, స్థానికులు ఉన్నారు.