Pensioners protest : కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెన్షనర్ల ఆగ్రహం: తహసీల్దార్‌కు మెమోరాండం అందజేత

Pensioners protest కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల భవిష్యత్తుపై తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ టేక్మాల్ మండల పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్ధార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ తులసీరామ్ ద్వారా ప్రధానికి వినతి పత్రాన్ని అందజేశారు. 31 డిసెంబర్ 2025 వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లలో భవిష్యత్తులో ఎలాంటి పెంపుదల చేయకూడదని ప్రభుత్వం చట్టం తీసుకురావడాన్ని అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Pensioners protest

ప్రభుత్వ తాజా చట్టం ప్రకారం.. గతంలో ఇస్తూ వచ్చిన వేతన సవరణలు (PRC), కరవు భత్యం (DA) పెంపుదలలు ఇకపై ఉండవని పేర్కొనడం పెన్షనర్ల జీవితాలను దెబ్బతీయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లకు ఇచ్చే కనీస ప్రయోజనాలను నిలిపివేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ఈ చట్టానికి నిరసనగా దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఆందోళనలు చేపడుతున్నారు.

అందులో భాగంగానే ప్రధానమంత్రికి పంపాల్సిన మెమోరాండంను స్థానిక తహసీల్దార్ గారికి అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కె. నారాయణ, ప్రధాన కార్యదర్శి టి. శంకర్ రావు, కోశాధికారి బి. నర్సింలు, సభ్యులు మల్లేశం, సంపత్, అశోక్ రెడ్డి, ధనంజయ, రాజయ్య, రాజు, శివలింగప్ప తదితరులు పాల్గొన్నారు.