రైతుభరోసా ఇక లేనట్లేనా? కేబినెట్ భేటీలో ఊసేలేని సాయం.. అయోమయంలో అన్నదాత!

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘రైతుభరోసా’ పెట్టుబడి సాయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నిధులపై మాత్రం ఎటువంటి ప్రస్తావన రాకపోవడం గమనార్హం. దీంతో ఈ సీజన్‌కు రైతుబంధు వస్తుందా? రాదా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

కేబినెట్ భేటీలో కనిపించని చర్చ!
దాదాపు ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలపై చర్చించిన ప్రభుత్వం, రైతుబంధు అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆశ్చర్యకరంగా, ఈ కీలక భేటీకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మాట తప్పిన ముఖ్యమంత్రి, మంత్రి? గతంలో రైతుబంధు పంపిణీపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత, ఫిబ్రవరి 4వ తేదీ నుంచి రైతుబంధు ఇస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. మంత్రి తుమ్మల ఫిబ్రవరి 5 నాటికి, అంటే నాట్లు పూర్తి కాకముందే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని వ్యవసాయ మంత్రి హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు.

ముగిసిన నాట్లు.. అందని పైసలు:
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి, గ్రామాల్లో నాట్లు వేయడం కూడా పూర్తయ్యింది. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం పైసా విదిల్చలేదు. డిసెంబర్‌లోనే అందాల్సిన ఈ సాయం కోసం రైతులు అప్పులు చేసి సాగు మొదలుపెట్టారు. ఇప్పుడు సీజన్ ముగిసే దశకు వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల ఆగ్రహం:
ఓ పక్క కాంగ్రెస్ ఆఫీసులకు భూకేటాయింపులు, ఇతర ప్రాజెక్టులపై కేబినెట్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. తమకు అందాల్సిన పెట్టుబడి సాయంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుబంధును ప్రభుత్వం పక్కన పెట్టేసిందా? అనే చర్చ ఇప్పుడు పల్లెల్లో జోరందుకుంది.