Mlc Vijayashanthi: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (రాములమ్మ) తన స్వంత ప్రభుత్వంపైనే ధ్వజమెత్తారు. మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సూటి ప్రశ్నలు సంధించారు.
హామీలు ఇచ్చి రెండేళ్లు దాటినా.. అడుగు ముందుకు పడలే!
తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విజయశాంతి గుర్తు చేశారు. “అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ, ఉద్యమకారులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇంకా నెరవేరలేదు. క్షేత్రస్థాయిలో ఉద్యమకారులు మమ్మల్ని నిలదీస్తున్నారు, మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Mlc Vijayashanthi విజయశాంతి ప్రధానంగా లేవనెత్తిన అంశాలు
- అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం: ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి.
- గౌరవ పెన్షన్: అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల గౌరవ పెన్షన్ ఇస్తామని చెప్పాం, దాని ఊసే లేదు.
- గుర్తింపు కార్డులు: జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రభుత్వ అధికారిక గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించినా, ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.
ప్రభుత్వం స్పందించాలి..
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యమకారుల త్యాగాల పునాదులపై. అటువంటి వారిని విస్మరించడం సరికాదు. ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి, ఉద్యమకారులకు అండగా నిలవాలి” అని విజయశాంతి డిమాండ్ చేశారు.
సొంత పార్టీ ఎమ్మెల్సీయే ప్రభుత్వంపై ఇలా శాసనమండలిలో విమర్శలు చేయడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.