Joginatha Rathotsavam : సంగారెడ్డి (Sangareddy)జిల్లా, జోగిపేట (Jogipet)లోని జోగినాథ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శివపార్వతుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఈ వేడుకలను చూసేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరహనుమాన్ దేవాలయం నుంచి శివపార్వతుల విగ్రహాలను మంగళవాయిద్యాలతో జోగినాథుడి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు.
కల్యాణానికి హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ

Joginatha Rathotsavam
శివపార్వతుల కల్యాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణ వేడుకలను తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఎన్. సురేందర్ గౌడ్, రంగ సురేశ్, పీ ప్రవీణ్ కుమార్, నాని నాగరాజ్, కౌన్సిలర్లు పట్లోళ్ల శ్రీనివాస్, కోశిక రాజశేఖర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లిఖార్జున్, మాజీ ఏఈపీ హెచ్. రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు.