స్టీల్‌ప్లాంట్‌లో నేడు సమ్మె

విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ, కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్లాంటులో ఉన్న 9,000 మంది శాశ్వత ఉద్యోగులు, మరో 9,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఏకకాలంలో విధులకు దూరం కానున్నారు.

ఈ నేపథ్యంలో ప్లాంట్ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, ఎగ్జిక్యూటివ్ అధికారులందరూ గురువారం 12 గంటల షిఫ్టుల చొప్పున పనిచేయాలని ఆదేశించింది. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు ఒక షిఫ్ట్, రాత్రి 8 నుండి మరుసటి రోజు ఉదయం 8 వరకు మరో షిఫ్ట్‌గా విభజించి, కీలక విభాగాల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.