Tekmal: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూరులో శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి భక్తులు పవిత్ర జలాలను తీసుకెళ్లి లింగాభిషేకం చేశారు. అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. భజన గీతాలు, శివనామస్మరణతో శివాలయం మారుమోగింది. పూజా కార్యక్రమాలకు విచ్చేసిన భక్త జనానికి అన్న ప్రసాద వితరణ చేశారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.
