కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన కవలలు దుంపటి విజయ్, వినయ్ లు దేమికలాన్‌కు చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే మరో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకున్నారు.
పెళ్లిళ్లలో రకరకాల వింతలు చూస్తుంటాం కానీ, కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక వివాహం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇద్దరు కవల సోదరులు, ఇద్దరు కవల సోదరీమణులను మనువాడి ఒక అరుదైన ఘట్టానికి వేదికయ్యారు. ఒకే పోలికలతో ఉన్న వధూవరులను చూసి పెళ్లికి వచ్చిన అతిథులు సైతం ‘ఎవరు ఎవరో’ గుర్తుపట్టలేక తికమకపడ్డారు.
ఘన్‌పూర్ టూ దేమికలాన్.. డబుల్ ధమాకా!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన దుంపటి సాయిలు – లక్ష్మి దంపతుల కుమారులు విజయ్ మరియు వినయ్ కవలలు. వీరికి తగిన వధువుల కోసం వెతుకుతుండగా, బీబీపేట మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య – మల్లావ్వ దంపతుల కుమార్తెలు కీర్తన మరియు కీర్తి గురించి తెలిసింది. వీరు కూడా కవలలు కావడం విశేషం. రెండు కుటుంబాల వారు మాట్లాడుకుని, కవలలకు కవలలతోనే వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు.
ఒకే పందిరి.. ఒకే ముహూర్తం
ఆదివారం ఫిబ్రవరి 22 అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజున ఈ రెండు జంటలకు పెళ్లి జరగడం విశేషం. ఈ వివాహ వేడుకలో వధువులిద్దరూ, వరులిద్దరూ ఒకే రకమైన పట్టు వస్త్రాలు ధరించి మెరిసిపోయారు. ఒకేలా ఉన్న ఇద్దరు పెళ్లికొడుకులు, ఇద్దరు పెళ్లికూతుళ్లను చూసి పెళ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోయారు. ఎవరు ఎవరో గుర్తుపట్టడం కష్టంగా మారిందని, ఇది నిజంగా ఒక అరుదైన వేడుక అని బంధుమిత్రులు చర్చించుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ వినూత్న వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. “డబుల్ సెలబ్రేషన్”, “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ నెటిజన్లు ఈ కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ “కవలల కలయిక” ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.