తండ్రిని చంపిన కుమారుడు, ముక్కలుగా నరికేసి ఆ తర్వాత..?

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగుచూసింది. చదువుకోవాలని తండ్రి ఒత్తిడి చేయడమే ఆ కన్నతండ్రి పాలిట శాపమైంది. నీట్ (NEET) పరీక్షకు సిద్ధం కావాలని పదే పదే మందలిస్తున్నాడన్న కోపంతో, ఒక 19 ఏళ్ల యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్‌లో దాచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానిక ‘వర్ధమాన్ పాథాలజీ’ ల్యాబ్ యజమాని మన్వేంద్ర ప్రతాప్ సింగ్ గత రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మన్వేంద్ర ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ ఒక డ్రమ్‌లో దాచి ఉంచిన మృతదేహ భాగాలను చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.

పోలీసులు మన్వేంద్ర కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, మొదట పొంతన లేని సమాధానాలు చెప్పాడు. కానీ, పోలీసుల శైలిలో విచారించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. నీట్ పరీక్షకు సిద్దం కావాలని తండ్రి పదే పదే ఒత్తిడి చేయడం, తిట్టడంతో తండ్రిపై పగ పెంచుకున్నాడు. శనివారం సాయంత్రం చదువు విషయంలో తండ్రీకొడుకుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆవేశం ఆపుకోలేక తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఇంట్లోని డ్రమ్‌లో దాచాడు. కొన్ని శరీర భాగాలను సమీపంలోని సదరోనా గ్రామం వద్ద పారేసినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చదువుల ఒత్తిడి ప్రాణాలు తీసే స్థాయికి చేరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.