keshavapur :సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా, కనుల పండుగగా జరిగింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ముదిరాజ్ కులస్థులతో పాటు గ్రామస్తులందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
keshavapur భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు
ఉదయం నుంచే మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సిద్ధం చేశారు. బోనపు కుండలను పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు రెమ్మలు చుట్టి, వాటిపై దీపాలు వెలిగించి అమ్మవారి చెంతకు బయలుదేరారు. డప్పు చప్పుల మధ్య, శివసత్తుల పూనకాలతో గ్రామంలో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అమ్మవారికి మొక్కుల సమర్పణ
ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి, ఒడి బియ్యం పోసి, నైవేద్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భోనగిరి మమతా తిరుపతి, ముదిరాజ్ కుల పెద్దలు, పెద్ద సంఖ్యలో మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది.