RCB vs SRH IPL 2026 బెంగళూరు: ఐపీఎల్ 19వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శుభారంభం చేసింది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. క్లిష్టమైన లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, తమ ‘ఛాంపియన్’ ఫామ్‌ను కొనసాగించింది.
హైదరాబాద్ భారీ స్కోరు.. ఇషాన్ కిషన్ ఒంటరి పోరాటం
RCB vs SRH IPL 2026 టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టులో కెప్టెన్ ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్ (11), అభిషేక్ (7) నిరాశపరిచినా.. కిషన్‌కు తోడుగా క్లాసెన్ (31), ఆఖర్లో అనికేత్ (43) రాణించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో అరంగేట్రం ఆటగాడు జాకబ్ డఫీ (3/22), రొమారియో షెఫర్డ్ (3/54) తలా మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు.
RCB vs SRH IPL 2026 కోహ్లీ, పడిక్కల్ మెరుపులు.. ఆర్సీబీ ఊచకోత
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్ ఫిల్ సాల్ట్ (12) త్వరగానే నిష్క్రమించినా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరోవైపు వెటరన్ స్టార్ విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) తన క్లాస్ ఆటతో అలరించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాన్ని ఖాయం చేశారు. ఆఖర్లో కెప్టెన్ పాటిదార్ (31) సహకరించడంతో ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి గెలుపొందింది.
మృతులకు ఘన నివాళి
గతేడాది ఐపీఎల్ టైటిల్ సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు ఇరు జట్ల ఆటగాళ్లు ఘనంగా నివాళులర్పించారు. మృతుల జ్ఞాపకార్థం ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్లో ’11’ నంబర్ జెర్సీలు ధరించడమే కాకుండా, స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచి వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన చేసి బరిలోకి దిగారు.
RCB vs SRH IPL 2026 స్కోరు బోర్డు ముఖ్యాంశాలు:
కెప్టెన్ ఇషాన్ కిషన్(38 బంతుల్లో 80, 8ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో హైదరాబాద్ 20 ఓవర్లలో 201/9 స్కోరు చేసింది. క్లాసెన్(31), అనికేత్(43) రాణించడంతో హైదరాబాద్ పోరాడే స్కోరు దక్కింది. అరంగేట్రం బౌలర్ జాకబ్ డఫీ(3/22), రొమారియో షెఫర్డ్(3/54) మూడేసి వికెట్లతో రాణించారు. లక్ష్యఛేదనలో విరాట్‌కోహ్లీ(38 బంతుల్లో 69 నాటౌట్, 5ఫోర్లు, 5 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్(26 బంతుల్లో 61, 7ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో బెంగళూరు 15.4 ఓవర్లలో 203/4 స్కోరు చేసింది. డేవిడ్ పైన్(2/35)రెండు వికెట్లు తీశాడు. డఫీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జాకబ్ డఫీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్: 201/9 (20 ఓవర్లు) – ఇషాన్ కిషన్ 80, అనికేత్ 43; జాకబ్ డఫీ 3/22.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 203/4 (15.4 ఓవర్లు) – విరాట్ కోహ్లీ 69*, దేవదత్ పడిక్కల్ 61; డేవిడ్ పైన్ 2/35.