Cantonment Vani : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం మారేడ్‌పల్లిలో ‘కంటోన్మెంట్ వాణి’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో మోండా డివిజన్ పరిధిలోని షెనాయ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
Cantonment Vani ఒకే వేదికపై అన్ని శాఖల అధికారులు
సాధారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని గుర్తించిన ఎమ్మెల్యే శ్రీగణేష్, ప్రత్యేక చొరవతో అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకే చోటకు చేర్చారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ, ఇంజనీరింగ్, జలమండలి (HMWS), విద్యుత్ శాఖ, హెల్త్ అండ్ శానిటేషన్, హార్టీకల్చర్, సివిల్ సప్లయ్స్, గృహ నిర్మాణ శాఖ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు విభాగాల అధికారులందరూ ఒకే వేదికపై ఉండి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే శ్రీగణేష్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రజల మౌలిక అవసరాలైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, ఆరోగ్యం మరియు శానిటేషన్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన ప్రతి వినతిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల సమస్యలను తీర్చడం నా కనీస బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ప్రజల కోసం విధుల్లో పాల్గొన్న అధికారులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్, నాగేష్ యాదవ్, అరవింద్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, నర్సింగరావు, వెంకట్రాజు, ధనలక్ష్మి, బాబూరావు తదితరులు ఉన్నారు.