కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ను విస్మరించింది

Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తుంగలో తొక్కుతోందని భారత రాష్ట్ర సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదినిని కలిసి, అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించింది.

మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి కాంగ్రెస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ప్రచారం ముగిసినా.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి, సురివి యాదయ్య గౌడ్, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి సదానంద్ తదితరులు పాల్గొన్నారు.