మెదక్, సెప్టెంబర్ 25: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్’లో భాగంగా మెదక్ మార్కెట్ యార్డులో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ రేపు (శనివారం, 26 సెప్టెంబర్ 2026) ఉదయం 9:30 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ‘హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా’ ఈ పథకానికి అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
కొడంగల్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ విశేష ప్రజాదరణ పొందింది. అనంతరం మధిర, మంథని, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించగా, తాజాగా మెదక్‌లో కూడా ఈ కిచెన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
లబ్ధి పొందనున్న 29,183 మంది విద్యార్థులు: ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మెదక్ మరియు నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలోని 11 మండలాల్లో గల 395 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం పరిశుభ్రమైన, రుచికరమైన వేడివేడి అల్పాహారాన్ని పంపిణీ చేయనున్నారు.
‘NIN’ సహకారంతో ప్రత్యేక మెనూ: విద్యార్థులకు సమతుల్య పోషకాలు అందేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన మెనూ ప్రకారం అల్పాహారం అందించనున్నారు:
- ఇడ్లీ – సాంబార్
- పూరి – ఆలూ కుర్మా
- దోశ – చట్నీ
- ఉప్మా – చట్నీ
- మిల్లెట్ ఇడ్లీ – సాంబార్
- బోండా – చట్నీ దీనితో పాటు విద్యార్థుల ఆరోగ్యానికి మేలు చేకూరేలా రోజు విడిచి రోజు వేడి పాలను కూడా అందించనున్నారు.
విద్యార్థులు ఆకలితో కాకుండా, ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో ఉత్సాహంగా తరగతులకు హాజరై చదువుపై ఏకాగ్రత చూపేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది.







