ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, వివాదాస్పద ‘సర్’ (SIR) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి దేశవ్యాప్తంగా నిరసనలను ఉధృతం చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) రెండు అత్యంత కీలక నిర్ణయాలు వెలువరించింది. రాజకీయ పార్టీలు కొన్నేళ్లుగా పట్టుబడుతున్న రీడబుల్, సెర్చబుల్ (శోధించగలిగే) ఓటర్ల జాబితాల సాఫ్ట్‌కాపీలను అందించేందుకు ఎట్టకేలకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
సెర్చబుల్ ఓటర్ జాబితాలతో పారదర్శకత
ఇప్పటివరకు ఎన్నికల సంఘం కేవలం ఇమేజ్ రూపంలో స్కాన్ చేసిన పీడీఎఫ్ (PDF) ఫైళ్లను మాత్రమే గుర్తింపు పొందిన పార్టీలకు అందించేది. వీటిలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, గుర్తింపు కార్డుల వివరాలను నేరుగా కంప్యూటర్లలో శోధించడం (Search), కాపీ చేయడం లేదా ఫిల్టర్ చేయడం అసాధ్యంగా ఉండేది. అర్హులైన ఓట్ల తొలగింపు, నకిలీ ఓటర్ల చేరిక, ఒకే ఓటరుకు పలు ప్రాంతాల్లో పేర్లు ఉండటం వంటి అవకతవకలను సులువుగా గుర్తించాలంటే.. సులభంగా శోధించగలిగే పీడీఎఫ్ లేదా వర్డ్ ఫార్మాట్‌లలో జాబితాలు ఇవ్వాలని విపక్షాలు ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తున్నాయి.

గతంలో (2018లో) మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అప్పట్లో ఈసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఓటర్ల వ్యక్తిగత వివరాలు బహిర్గతమై డేటా గోప్యతకు భంగం కలుగుతుందని, దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని వాదించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయతను పెంచేందుకు ఈసీ తన వైఖరిని మార్చుకుని, పార్టీలకు సెర్చబుల్ ఫైళ్లను అందించేందుకు పచ్చజెండా ఊపింది.
17 రాష్ట్రాల్లో ప్రత్యేక సమ్మరీ రివిజన్ (SSR)
మరోవైపు ‘సర్’ ప్రక్రియ పూర్తయిన దేశంలోని 17 రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణల కోసం విస్తృత స్థాయిలో ‘ప్రత్యేక సమ్మరీ రివిజన్ (SSR)’ చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాల్లోని లోపాలను సవరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. విపక్షాల నిరసనల సెగ నేపథ్యంలో ఈసీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు ఎన్నికల నిర్వహణలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.







