నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట్ గ్రామంలో ఓ యువకుడు తన సేవా గుణంతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. గ్రామంలోని తోట చివరి కాలనీలో ఏళ్ల తరబడి నెలకొన్న రోడ్డు సమస్యకు యువకుడు ఉప్పరి లక్ష్మణ్ సాగర్ తన సొంత ఖర్చులతో శాశ్వత పరిష్కారం చూపించి ఆదర్శంగా నిలిచారు.
తోట చివరి కాలనీలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీకి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్డంతా బురదమయమై, నీరు నిలిచి స్థానికులు, వృద్ధులు, చిన్నారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడేవారు. స్థానికుల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన లక్ష్మణ్ సాగర్ తక్షణమే స్పందించారు.
సొంత నిధులను వెచ్చించి జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను రంగంలోకి దించారు. కంకర, మట్టి, మొరం పోయించి గుంతలను పూడ్చడంతో పాటు, అవసరమైన చోట్ల నూతనంగా రోడ్డు నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. కేవలం రెండు రోజుల్లోనే పనులను శరవేగంగా పూర్తి చేసి కాలనీ ప్రజలకు రాకపోకల కష్టాలు తీర్చారు.
ఏళ్ల నాటి సమస్యను స్వచ్ఛందంగా పరిష్కరించిన లక్ష్మణ్ సాగర్‌ను కాలనీవాసులు, మహిళలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా సమాజ సేవలో ముందుకొచ్చిన లక్ష్మణ్ సాగర్ యువతకు నిజమైన స్ఫూర్తిప్రదాత అని గ్రామ పెద్దలు కొనియాడారు. ఇదే స్ఫూర్తితో గ్రామంలోని ఇతర మౌలిక సమస్యలను కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.





