తెలంగాణలో సోమవారం (అక్టోబర్ 5) నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వం పెంచిన లైసెన్స్ ఫీజులు, కొత్తగా అమలులోకి తెస్తున్న ప్రివిలేజ్ సెస్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అసోసియేషన్ తేల్చిచెప్పింది.
గతంలో రూ.40 లక్షలుగా ఉన్న బార్ లైసెన్స్ ఫీజును ప్రభుత్వం ఏకంగా రూ.44 లక్షలకు పెంచింది. దీనికి అదనంగా ప్రివిలేజ్ సెస్‌ను స్లాబ్ విధానంలో 8 శాతం నుంచి 20 శాతం వరకు వడ్డించడాన్ని బార్ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాలు వ్యాపారాన్ని దెబ్బతీస్తాయని, వీటిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,200కు పైగా బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. పెంచిన లైసెన్స్ ఫీజులను తగ్గించాలని, కొత్తగా తెచ్చిన ప్రివిలేజ్ సెస్‌ను పూర్తిగా రద్దు చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే సోమవారం ఉదయం హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది. అప్పటికీ స్పందన రాకుంటే నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించింది. బార్ల యజమానుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది.







