సంగారెడ్డి ప్రతినిధి ( ప్రజా నేస్తం డిజిటల్ న్యూస్ ) సెప్టెంబర్30 : ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంకితభావంతో ప్రజాసేవ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ సర్వీసులో అంకితభావంతో పనిచేసి ప్రజలకు విశేష సేవలందించిన ఉద్యోగుల సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందిన అనంతరం కూడా సమాజ హితం కోసం తమ అనుభవాన్ని ఉపయోగించాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి, వారి భవిష్యత్తు జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో పాటు కలెక్టరేట్ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను అభినందించారు.





