అందోల్, సెప్టెంబర్ 28 (ప్రజానేస్తం ప్రతినిధి): గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా పొందే బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకుని సొంతంగా జీవనోపాధిని పెంపొందించుకోవాలని ఐబీ డీపీఎం జాన్ కెనడీ, ఐబీ ఏపీఎం శివకుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆందోల్ మండలం పరిధిలోని నేరేడుగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అధికారులు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే కుటుంబాలు, గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ ట్రైనర్లు స్వప్న, వసంత మహిళలకు పొదుపు ఆవశ్యకత, సంఘాల పారదర్శక నిర్వహణ, రుణాల వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించారు. చిన్న తరహా వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, పశుపోషణ వంటి ఆదాయ వనరులను ఎంచుకోవడం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని వివరించారు.
పేదరిక నిర్మూలనలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, సకాలంలో రుణాలు చెల్లిస్తూ మరింత పెద్ద మొత్తంలో రుణాలు పొంది వ్యాపారాలను విస్తరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ మండల ఏపీఎం దేవేందర్, సీసీ మల్లేశం, వీఓఏలు అశోక్, సునీతతో పాటు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, యానిమేటర్లు, పెద్ద సంఖ్యలో మహిళా సభ్యులు పాల్గొన్నారు.





