అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
కురవి, అక్టోబర్ 7:ఆపదలో ఉన్నవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోని బంచరాయితండా గ్రామానికి చెందిన పలువురు అనారోగ్య బాధితులను బుధవారం ఆమె స్వయంగా వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి, ధైర్యం చెప్పారు.
విలేకరి తండ్రికి పరామర్శ.. ఆర్థిక భరోసా
బంచరాయితండాకు చెందిన స్థానిక పత్రిక విలేకరి దేవన్న తండ్రి బానోత్ సక్రం ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు సరైన మందులు వాడుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ప్రమాద బాధితుడు శ్రీనుకు పరామర్శ
అదే గ్రామానికి చెందిన నునావత్ శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలు కావడంతో వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్స చేసి ఒక కాలును తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనును సత్యవతి రాథోడ్ పరామర్శించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుత చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ ఆయనకు కూడా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.

ప్రజాసేవలో, ఆపదలో ఉన్న బాధితులకు చేయూతనివ్వడంలో ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నునావత్ వీరన్న, మాజీ ఎంపీటీసీ వీరు నాయక్, నాయకులు తేజ నాయక్, సేత్య, శరత్, ఐలి నరహరి గౌడ్, బోడ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.




