నారాయణఖేడ్: నారాయణ ఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలో అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే నిర్మించాలని, గుంతలను పూడ్చాలని డిమాండ్ చేస్తూ కారముంగి నుంచి కారస్గుత్తి వరకు మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర, ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నారాయణఖేడ్ నుండి డబుల్ లైన్ రోడ్డు వేయించా, అనేక రోడ్లు శాంక్షన్ చేయించా, నాలుగు కొత్త చెరువులు మంజూరు చేయించా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శాంక్షన్ అయిన రోడ్లను కూడా పూర్తి చేయడం లేదు. కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోతున్నారు” అని మండిపడ్డారు.
“రైతులు అప్పులు చేసి పంటలు వేస్తే కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. 24 గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్, ఇప్పుడు రైతులను సబ్స్టేషన్ల చుట్టూ తిప్పుతోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కమిషన్ల ప్రభుత్వం” అని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు BRS పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, సర్పంచ్‌లు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






