మెదక్, అక్టోబర్ 4: పంటలు పొట్ట దశలో ఉన్న సమయంలో రైతులకు కనీసం ఆరు గంటల త్రీఫేజ్ విద్యుత్ కూడా అందడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. విద్యుత్ సరఫరా మెరుగుపడకపోతే రేపటిలోగా రైతులతో కలిసి అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె ఏడీఈ మోహన్‌బాబును కలిసి రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను వివరించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో త్రీఫేజ్ సరఫరా సక్రమంగా లేదని, పంటలు కీలక దశలో ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సమస్యను రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని అన్నారు. విద్యుత్ అంతరాయాలతో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రైతులు విద్యుత్ కోసం మండలాల్లో ధర్నాలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని విమర్శించారు. రైతుల కష్టాలు ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన పద్మా దేవేందర్‌రెడ్డి.. కనీసం ఎనిమిది గంటల త్రీఫేజ్ విద్యుత్ కూడా అందడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా విద్యుత్ సరఫరా మెరుగుపడి, రైతులకు అవసరమైన మేరకు నిరంతర త్రీఫేజ్ విద్యుత్ అందించాలని, లేకుంటే అన్ని మండలాల్లో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.








