సంగారెడ్డి : సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోగా తమ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
పోలీస్ కొలువులు సాధించాలనే పట్టుదలతో ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంత యువతను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ కేంద్రాలలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఎంపికైన అభ్యర్థులకు అనుభవజ్ఞులైన నిపుణులతో నాణ్యమైన శిక్షణ అందించడంతో పాటు, ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు పూర్తి చేసి పోలీస్ స్టేషన్లలో సమర్పించాలని కోరారు.





