నారాయణఖేడ్ : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ అంబేద్కర్ భవన్ వద్ద శుక్రవారం KVPS జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి KVPS సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొటారి నర్సింలు మాట్లాడుతూ.. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) 1998 అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలుగు రాష్ట్రాల్లో దళితుల సమస్యల పరిష్కారం, ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో ఏర్పడిందన్నారు.
KVPS ఆవిర్భావం అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో దళితులపై కొనసాగుతున్న అంటరానితనం, కుల వివక్ష తదితర వివక్ష రూపాలపై సర్వేలు నిర్వహించి వాటిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిందన్నారు.
ప్రభుత్వాలు స్పందించని సందర్భాల్లో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడంతో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు జరిగిందని తెలిపారు. KVPS భాగస్వామ్యంతో జస్టిస్ పున్నయ్య కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి దళితులు ఎదుర్కొంటున్న వివక్ష రూపాలను పరిశీలించిందని, వాటి నిర్మూలనకు 104 సిఫారసులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందని పేర్కొన్నారు. అయితే ఆ సిఫారసుల అమలులో ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపించిందని, కొద్దిపాటి సిఫారసులు మాత్రమే అమలవుతున్నాయని అన్నారు. KVPS ఆవిర్భావం నుంచి దళితుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని, జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు, ఎస్సీ–ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం, దళితులకు స్మశానవాటికల నిర్మాణానికి సంబంధించిన 1235 జీవో వంటి అంశాల్లో ఉద్యమాలు నిర్వహించిందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ దళితులకు రాజ్యాంగ హక్కులు నిరాకరించబడినా KVPS వారి పక్షాన నిలబడి అన్యాయాలను ప్రశ్నిస్తోందన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా దళితులకు అందాల్సిన హక్కులు, చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఉద్యమాలను బలోపేతం చేసి దళితులు, బహుజనులు హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు బి. కన్షీరాం, అంబేద్కర్ ఫూలే సేవా సమితి డివిజన్ అధ్యక్షులు ఎస్. నర్సింలు, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ యువజన్ అధ్యక్షులు సంతోష్, సీఐటీయూ జిల్లా నాయకులు రమేష్, మైనారిటీ సంఘం డివిజన్ అధ్యక్షులు మనోద్దీన్ కుర్షిత్, KVPS జిల్లా నాయకులు ఎస్. గణపతి, అరుణ్, గౌతం, రామప్ప, సతీష్ తదితరులు పాల్గొన్నారు.






