బెల్లంపల్లి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ వేడుకలు బెల్లంపల్లి పట్టణంలో అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని కాల్‌టెక్స్ ఏరియా 12వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ధారావత్ తిరుమల వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వార్డులోని మహిళా సోదరీమణులతో కలిసి దుర్గం చిన్నయ్య బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ సంబరాల్లో పాలుపంచుకున్నారు. మహిళలంతా తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయ పాటలతో లయబద్ధంగా ఆడుతూ పాడుతూ సందడి చేశారు. దీంతో కాల్‌టెక్స్ 12వ వార్డు ప్రాంగణం ఆధ్యాత్మిక మరియు పండుగ శోభతో కళకళలాడింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఆత్మీయతకు బతుకమ్మ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకృతిని, పూలను పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణకే సొంతమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు నునేటి సత్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, 21వ వార్డు కౌన్సిలర్ బడికల రమేష్, 10వ వార్డు మాజీ కౌన్సిలర్ కొక్కెర చెందు, సీనియర్ నాయకులు ఈటా రాకేష్, తుమ్మ శ్రీనివాస్, ఎం.డి. హనీఫ్ పాషా, కొట్టే వినయ్, బంక కుమార్, రవీందర్ రెడ్డి, సంపత్, పాషా భాయ్ తదితరులతో పాటు వార్డు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








