మద్వార్ : వివాహేతర సంబంధం కారణంగా తలెత్తిన కలహాలు చివరకు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిద్రిస్తున్న భర్తపై భార్యే స్వయంగా పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్యంత దారుణ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్ మండలం మద్వార్ గ్రామానికి చెందిన బాలస్వామి (46), తెలపల్లి రాములమ్మ దంపతులకు సుమారు 28 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా బాలస్వామి అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రాములమ్మ పలుమార్లు భర్తను మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతుండేవి.

భర్త తీరుపై తీవ్ర ఆగ్రహం, మనస్తాపానికి గురైన రాములమ్మ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి సమయంలో బాలస్వామి ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా.. వ్యవసాయ పనుల నిమిత్తం ఇంట్లో నిల్వ ఉంచిన పెట్రోల్‌ను అతనిపై గుమ్మరించి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలస్వామి కేకలు వేయగా, చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
తీవ్రంగా గాయపడిన బాలస్వామిని కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న బాలస్వామి తుదిశ్వాస విడిచారు.
ఈ విషాద ఘటనపై డీఎస్పీ నల్లపు లింగయ్య మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. బాలస్వామి మృతికి ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలం (Dying Declaration), ఘటనా స్థలంలో సేకరించిన సాంకేతిక ఆధారాల మేరకు నిందితురాలు రాములమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించిందని తెలిపారు. నిందితురాలిపై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం కింద హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.







