ఆందోల్ : మంజూరైన ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో చోటుచేసుకుంటున్న జాప్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. అందోల్ మండలం అల్మాయిపేట గ్రామం సమీపంలో 161వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మంజూరైన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించకపోవడం వల్లే వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూటర్న్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు
స్థానికుల వివరాల ప్రకారం.. అల్మాయిపేట గ్రామానికి చెందిన రాయిని శ్రీకాంత్ అనే యువకుడు బుధవారం చౌటకూర్ నుంచి తన స్వగ్రామమైన అల్మాయిపేటకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. గ్రామ శివారులోని జాతీయ రహదారి వద్ద యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, ఎర్రారం గ్రామం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అతడి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రతకు శ్రీకాంత్ బైక్ పైనుంచి కిందపడి తీవ్ర రక్తగాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర గాయాల కారణంగా పరిస్థితి విషమించి, ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గమధ్యంలో శ్రీకాంత్ మృతి చెందాడు. చేతికందివచ్చిన యువకుడు అకాల మరణం చెందడంతో అల్మాయిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
పోలీసుల పరిశీలన – కేసు నమోదు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎస్సై గిరి శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పరిశీలించి, రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
మంత్రికే విజ్ఞప్తి.. ఫ్లైఓవర్ల నిర్మాణం ఎప్పుడు?
161వ జాతీయ రహదారిపై నిత్యం రద్దీగా ఉండే అల్మాయిపేటతో పాటు పలు కీలక జంక్షన్ల వద్ద గతంలో మూడు ఫ్లైఓవర్లు మంజూరైనట్లు పేపర్లలో ప్రకటనలు వచ్చాయని, కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా పడలేదని స్థానిక ప్రజలు మండిపడ్డారు. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ఏటా ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆవేదన చెందారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ చూపి వెంటనే స్పందించాలని స్థానికులు కోరారు. జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులతో సమీక్షించి, అల్మాయిపేట వద్ద వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రాణనష్టం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.








