ఆందోల్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాన్‌పల్లి గ్రామంలో దుండగులు ఒకే రాత్రి వరుస దొంగతనాలకు పాల్పడి తీవ్ర కలకలం సృష్టించారు. అర్ధరాత్రి వేళ ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలతో పాటు వాహనాన్ని ఎత్తుకెళ్లడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి మల్లారెడ్డి ఇంట్లోకి చొరబడిన దుండగులు తులం బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.60 వేల నగదును దోచుకెళ్లారు. అలాగే మందపురం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో మూడు తులాల పుస్తెల తాడు, ఐదు తులాల వెండి, రూ.30 వేల నగదును అపహరించారు. అనంతరం పాలడుగు మోహన్‌రెడ్డికి చెందిన ద్విచక్ర వాహనాన్ని (బైక్) ఎత్తుకెళ్లారు. మరోవైపు మందపురం అంజాగౌడ్‌కు చెందిన బైక్‌ను కూడా దొంగిలించేందుకు ప్రయత్నించగా, అది స్టార్ట్ కాకపోవడంతో మార్గమధ్యలోనే వదిలివెళ్లారు.

ఈ వరుస చోరీల్లో సుమారు రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి, నగదు, బైక్ చోరీకి గురైనట్లు గ్రామస్థులు లబోదిబోమంటున్నారు. సమాచారం అందుకున్న జోగిపేట ఎస్సై గిరి శ్రీకాంత్, పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామంలో రాత్రి సమయాల్లో పోలీసుల గస్తీ (పెట్రోలింగ్) మరింత ముమ్మరం చేసి తమకు రక్షణ కల్పించాలని రాంసాన్‌పల్లి గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.





