మెదక్, అక్టోబర్ 8: రైతులకు కనీసం 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజాంపేటలో గురువారం నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించి నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ఆందోళనకు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదని విమర్శించారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులకు కనీసం 12 గంటల నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మరో రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేశామని తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని అన్నారు. అనంతరం రామాయంపేట ఏఈ ఆదయ్య ఆందోళన స్థలానికి చేరుకుని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డితో చర్చించారు. రైతులకు 12 గంటల విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో రైతులు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








