ప్రజానేస్తం ప్రతినిధి : విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి చట్టసభల నిర్వహణ, చట్టసభల విధివిధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 31 పీఎం శ్రీ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులతో నమూనా పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మాక్ పార్లమెంట్‌లో విద్యార్థులే స్పీకర్‌గా, కేంద్ర మంత్రులుగా, అధికారపక్షం, ప్రతిపక్ష సభ్యులుగా పాత్రలు పోషించారు. విద్యార్థి స్పీకర్ సభా కార్యక్రమాలను నిర్వహించగా.. ఎంపీలుగా వ్యవహరించిన విద్యార్థులు వివిధ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ప్రశ్నలు సంధించారు.
ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులుగా ఉన్న విద్యార్థులు సమాధానాలు ఇవ్వడంతో అచ్చం పార్లమెంట్‌ను తలపించేలా సభా కార్యక్రమాలు నడిపించడంతో అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకుంది..సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు సమస్యలకు అధికారపక్షం తరఫున మంత్రులు సమాధానాలు ఇచ్చారు.కొన్ని సమాధానాలపై సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన మాక్ పార్లమెంట్ అచ్చం అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలను తలపించేలా సాగింది… విద్యార్థుల చురుకైన హావభావాలు, వాదనలు, ప్రశ్నలు, సమాధానాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యం, తార్కిక ఆలోచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
మాక్ పార్లమెంట్ ద్వారా విద్యార్థులకు పార్లమెంట్ నిర్వహణ తీరు, స్పీకర్ బాధ్యతలు, అధికారపక్షం–ప్రతిపక్షాల పాత్ర, ప్రశ్నోత్తరాల సమయం, ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం వంటి అంశాలపై ప్రత్యక్ష అవగాహన కలిగిందని విద్యార్థులు తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు పాఠశాలల స్థాయి నుంచి చట్టాల పై అవగాహన, పార్లమెంట్ నిర్వహణ, పార్లమెంట్లో ప్రభుత్వ పథకాల చట్టాలు అనే అంశాలకు పై చక్కటి ప్రోగ్రాం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ సామర్థ్యాలు పెంపొందించి దేశాన్ని ఉన్నత మార్గాల వైపు నడిపించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం పాల్గొన్న విద్యార్థులను ధృవపత్రాలు అందజేసి ప్రశంసించారు.





